మార్చి 12 ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన రోజు. ఉప్పు

 ఉప్పు పన్ను పై పోరు



మహాత్మా గాంధీ ప్రారంభించిన మూడు ముఖ్యమైన ఉద్యమాల్లో ఉప్పు సత్యాగ్రహం ఒకటి.భారతదేశంలో బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసనోల్లంఘనలో భాగంగా, మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెసు జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం. దీన్ని దండి సత్యాగ్రహం అనీ, దండి యాత్ర అనీ, దండి మార్చి అనీ కూడా పిలుస్తారు. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ గాంధీ,1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 వరకు, 384 కిలోమీటర్ల దూరం, వేలమంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ తీరం లోని దండి వద్ద ఉప్పు తయారు చేసారు. శాసనోల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలా స్ఫూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా దండి యాత్ర ఉపయోగపడింది. మహాత్మా గాంధీ తన 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లతో సబర్మతి ఆశ్రమంలో ఈ యాత్రను ప్రారంభించారు.రోజురోజుకూ పెరిగే సత్యాగ్రహులతో యాత్ర సాగి, 24 రోజుల తరువాత దండి వద్ద ముగిసింది. 1930 ఏప్రిల్ 6 న, ఉదయం 6:30 గంటలకు గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినప్పుడు, ఇది కోట్లాది భారతీయులు బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడానికి స్ఫూర్తినిచ్చింది.

ఉప్పు సత్యాగ్రహ ప్రచారం గాంధీ ప్రవచించిన సత్యాగ్రహ సూత్రాలపై ఆధారపడింది.1930 ప్రారంభంలో, బ్రిటిషు పాలన నుండి భారత సార్వభౌమత్వాన్ని, స్వయం పాలననూ సాధించుకోవటానికి భారత జాతీయ కాంగ్రెస్, తన ప్రధాన వ్యూహంగా సత్యాగ్రహాన్ని ఎంచుకుంది. ప్రచారాన్ని నిర్వహించడానికి గాంధీని నియమించింది. 1882 బ్రిటిషు ఉప్పు చట్టాన్ని గాంధీ తమ సత్యాగ్రహ మొదటి లక్ష్యంగా ఎంచుకున్నారు. దండికి పాదయాత్ర, ధరసానాలో వందలాది అహింసా నిరసనకారులను బ్రిటిషు పోలీసులు కొట్టడం వంటి సంఘటనలు సామాజిక రాజకీయ అన్యాయాలపై పోరాటంలో శాసనోల్లంఘనను సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రదర్శించాయి.


ప్రారంభంలో, గాంధీ ఎంచుకున్న ఉప్పు పన్ను సరైన ఎంపికని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భావించలేదు.జవహర్‌లాల్ నెహ్రూ, దిబ్యలోచన్ సాహూలు సందిగ్ధంగా ఉన్నారు. దాని బదులు భూమి శిస్తు బహిష్కరణ చేపడదామని సర్దార్ పటేల్ సూచించారు. స్టేట్స్‌మన్ పత్రిక ఈ ఎంపిక గురించి ఇలా వ్రాసింది: "నవ్వాపుకోవడం కష్టం. ఆలోచించగల చాలామంది భారతీయుల మానసిక స్థితి ఇదేనని మేము అనుకుంటున్నాం."  ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా ప్రతిఘటన యొక్క ఈ ప్రణాళికలతో బ్రిటిషు వారు కూడా కలవరపడలేదు. స్వయంగా వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ కూడా ఉప్పు నిరసన ముప్పును తీవ్రంగా పరిగణించలేదు. లండన్‌కు రాసిన ఉత్తరంలో, "ఈ ఉప్పు దండయాత్ర వలన నా నిద్రేమీ చెడిపోదులే" అని రాసాడతడు.



అయితే, తన నిర్ణయానికి గాంధీ వద్ద సరైన కారణాలే ఉన్నాయి. మరిన్ని రాజకీయ హక్కులు కావాలంటూ చేసే నైరూప్య డిమాండు కంటే, రోజువారీ వాడుకలో ఉండే అంశం అన్ని వర్గాల పౌరులతో ప్రతిధ్వనిస్తుంది.ఉప్పు పన్ను బ్రిటిషు రాజ్ పన్ను ఆదాయంలో 8.2% వరకూ ఉంటుంది. పేద భారతీయులకు చాలా భారంగా ఉండే పన్ను ఇది.తన ఎంపికను వివరిస్తూ గాంధీ, "గాలి, నీరూ.. ఆ తరువాత బహుశా ఉప్పే జీవితానికి అత్యవసరం" అని అన్నారు.


ఈ నిరసన పూర్ణ స్వరాజ్‌ను ప్రతి భారతీయుడికి అర్థమయ్యే విధంగా నాటకీయంగా మారుస్తుందని గాంధీ అభిప్రాయపడ్డారు. హిందువులు, ముస్లింలు ఇద్దరికీ ఉన్న సమస్యపై పోరాడటం ద్వారా వారిలో ఐక్యత పెరుగుతుందని కూడా ఆయన వాదించారు.



దండి మార్చి‌లో మహాత్ముడితో పాటు 79 మంది అనుచరులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి దండి మార్చిలో గాంధీతో పాటు నడిచిన ఏకైక తెలుగు వ్యక్తి యెర్నేని సుబ్రహ్మణ్యం. తర్వాత కాలంలో ఆయన గాంధీ సిద్ధాంతాలతో కొమరవోలులో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు.


నెల్లూరులో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించిన దండు నారాయణరాజును నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో ఆయన అక్కడే మరణించాడు. ఉప్పు సత్యాగ్రహం సమయంలోనే 'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి వీర గంధము తెచ్చినారము వీరులెవ్వరొ తెల్పుడి అనే గేయకవితను రాశాడు. మాక్సిం గోర్కీ రాసిన రష్యన్ నవల 'ది మదర్'ను 'అమ్మ' పేరుతో తెలుగులోకి అనువదించిన క్రొవ్విడి లింగరాజు, ఈ ఉద్యమ సమయంలోనే దేశ ద్రోహం నేరంపై జైలుకెళ్లారు.



1930 ల నాటి సత్యగ్రహ ఉద్యమాల తరువాత భారతదేశంపై తమకు ఉందనుకుంటున్న నియంత్రణ కేవలం భారతీయుల సమ్మతి పైనే ఆధారపడి ఉందని బ్రిటిషు వారు గుర్తించవలసి వచ్చింది - బ్రిటిషు వారు ఆ సమ్మతిని కోల్పోవడంలో ఉప్పు సత్యాగ్రహం ఒక ముఖ్యమైన దశ అని చెప్పవచ్చు.ఈ ఉద్యమం తక్షణ ఫలితాలు ఇవ్వలేదు గానీ,బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మలి దశలో జరిగిన ఉద్యమాలకు స్ఫూర్తి నిచ్చింది.


మార్చి 12 ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన రోజు. ఉప్పు

Comments

Popular posts from this blog

A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

AP 10th Public Exams Hall Tickets Download*